Raptadu Attack: విద్యార్థినిపై దాడితో సీఎం చంద్రబాబు సీరియస్.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం..!
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో జరిగిన దాడి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై భావోద్వేగానికి గురికాగా, హోంమంత్రి అనిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా స్పందించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన రంపం దాడి ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. తరగతి గదిలోనే చిన్నారిపై ఇంతటి అమానుష దాడి జరగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే పట్టుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. చిన్నారుల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తరగతి గదిలో రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నారులు, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. పిల్లల రక్షణ పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని, బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నారా లోకేష్ తేల్చిచెప్పారు.
మరోవైపు హోంమంత్రి అనిత ఈ ఘటనపై స్పందించి అనంతపురం జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. అటు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించడంతో పాటు ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒకే ఘటనపై ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు స్పందించడంతో బాలికకు న్యాయం చేయడంతో పాటు పాఠశాలల్లో పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.