Rapthadu: బాలికపై రంపంతో దాడి చేసిన హేమంత్పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్..!
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆత్మకూరు అడవుల్లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ వారిపై దాడికి దిగడంతో ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు.
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు అడవుల్లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ వారిపై దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు బెంగళూరులో చికిత్స పొందుతున్న బాధితురాలు గోపికను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాఠశాలలోనే బాలికపై రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడు హేమంత్‌ను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు చివరకు కాల్పుల వరకు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగించగా, నిందితుడిని త్వరగా పట్టుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో అతడి కోసం గాలింపు చేపట్టారు.
దాడి అనంతరం బైక్‌పై పరారైన హేమంత్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతుండగా.. ఆదివారం రాత్రి ఆత్మకూరు అడవుల్లో ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు రాళ్లతో దాడికి దిగినట్లు సమాచారం. ఈ సమయంలో పలువురు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హేమంత్పై ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
గాయపడిన హేమంత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక గోపిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గోపికను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రికి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం గోపిక కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. పోలీసుల కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.