అంబులెన్స్‌లలోనూ ఎర్రచందనం స్మగ్లింగ్.. 114 దుంగలు పట్టివేత.. పవన్ కల్యాణ్ వార్నింగ్!
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారికి ఇకపై ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా చేసేవారిలో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారికి ఇకపై ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా చేసేవారిలో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కడప డివిజన్ పరిధిలో అటవీశాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.
అధికారులు నిర్వహించిన దాడుల్లో సుమారు 114 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన ఏడు వాహనాలను సీజ్ చేశారు. ముఖ్యంగా అంబులెన్స్‌లు, కార్లను ఉపయోగించి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో సమన్వయంతో పనిచేసి నిందితులను పట్టుకున్న కడప జిల్లా అటవీశాఖ అధికారి, సిబ్బందిని పవన్ కల్యాణ్ అభినందించారు. ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా అన్ని మార్గాలపై నిఘా పెంచాలని యాంటీ రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులకు సూచించారు. స్మగ్లర్లు తప్పించుకునే అవకాశం లేకుండా పక్కా వ్యూహంతో ఆపరేషన్లు కొనసాగించాలని ఆదేశించారు.
ఇప్పటికే పట్టుబడిన వారితో పాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతర నిందితులను కూడా త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు వ్యక్తులు, నెట్‌వర్క్ వివరాలు బయటపడేలా దర్యాప్తు చేయాలని సూచించారు. అటవీ సంపదను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.