26 ఏళ్ల తర్వాత తమిళ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ.. ధనుష్ సినిమాలో కీలక పాత్ర!
బద్రి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్ 26 ఏళ్ల తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నవంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.
ఒకప్పుడు ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రేణు దేశాయ్.. ఇప్పుడు మరోసారి సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాలం పాటు నటనకు దూరంగా ఉన్న ఆమె, 2023లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్రతో కావడం విశేషం. దీంతో రేణు దేశాయ్ రీఎంట్రీపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
రేణు దేశాయ్ చివరిగా 2000 సంవత్సరంలో ‘జేమ్స్ పాండు’ అనే తమిళ సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్, ఆంధ్రప్రదేశ్-తమిళనాడు పోలీసుల నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. నవంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతున్నట్లు తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఓం’ సినిమా పోస్టర్ను షేర్ చేస్తూ.. నవంబర్ 20న థియేటర్లలో కలుద్దాం అంటూ పోస్ట్ చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీంతో 26 ఏళ్ల తర్వాత తమిళ తెరపై రేణు దేశాయ్ ఎలా కనిపించబోతున్నారు? ఆమె పాత్రకు సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉండబోతోంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. మరి ఈ రీఎంట్రీ ఆమెకు ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి.