వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Kalyan |

Political Heat: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కీలక ప్రకటన..!

Political Heat

సిద్దిపేట పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, మరో రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్‌మోహన్ పేరు పెడతామని ప్రకటించారు.

సిద్దిపేట పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో రూ.544.11 కోట్ల విలువైన పనులను ప్రారంభించగా, మరో రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు దుబ్బాక, సిద్దిపేటలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా స్కూళ్లకు భూమిపూజ చేశారు. ఆరు తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, 14 విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. సిద్దిపేట అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.550 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇకపై సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని కార్యకర్తలు నిరూపించారని వ్యాఖ్యానించారు. సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మదన్‌మోహన్‌ను స్మరించుకోవాలని, ఆయన పేరును చరిత్రలో లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్‌మోహన్ పేరు పెడతామని ప్రకటించారు. కేసీఆర్ పెట్టుబడి మోసమేనంటూ విమర్శలు చేసిన రేవంత్.. 2004లో హరీశ్ రావు వార్డు మెంబర్ కూడా కాదని వ్యాఖ్యానించారు. గజ్వేల్ గడ్డపై అడుగుపెట్టి కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని గతంలో చెప్పానని, ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ పాలన తీసుకొచ్చామని పేర్కొన్నారు. అంతేకాదు, సిద్దిపేట వేదికగా మరో కీలక ప్రకటన చేస్తూ 2029లోనూ రాష్ట్రంలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల పేరుతో కొందరు సిద్దిపేటను దోచుకున్నారని ఆరోపిస్తూ, త్వరలోనే బీఆర్ఎస్ కోటలు బద్దలవుతాయని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలోనూ కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైందని, ఇకపై ఒకే కుటుంబం ఆధిపత్యం ఉండదని అన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకాగా, సీఎం రేవంత్ రెడ్డి వారితో కరచాలనం చేస్తూ ఉత్సాహపరిచారు.