వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

Rice Prices: బియ్యం కొనేవారికి బిగ్ రిలీఫ్.. నెల రోజుల్లోనే కిలోపై రూ.10 తగ్గిన ధరలు.. ఇప్పుడు ఏ రకం ఎంతంటే..?

Rice Prices

బియ్యం ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఊరట లభించింది. ప్రభుత్వం చేపట్టిన నియంత్రణ చర్యలు, అధికారుల తనిఖీలతో నెల రోజుల వ్యవధిలోనే కిలో బియ్యంపై సుమారు రూ.10 తగ్గుదల కనిపించింది. బీపీటీ, కేఎన్‌ఎం రకాల ధర కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.74, హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్ రూ.79గా ప్రభుత్వం గరిష్ట ధరలు నిర్ణయించింది. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల ఆకాశాన్నంటిన బియ్యం ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ముఖ్యంగా సన్నబియ్యం కొనాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రకాల బియ్యం కిలో ధర ఏకంగా రూ.100 వరకు చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి క్రమంగా మారుతోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు, మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో నెల రోజుల వ్యవధిలోనే బియ్యం ధరలు కిలోకు సుమారు రూ.10 మేర దిగివచ్చాయి. దీంతో నిత్యం బియ్యం కొనుగోలు చేసే కుటుంబాలకు కొంత ఊరట లభించింది. కొద్దిరోజుల క్రితం వరకు బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా ఎల్‌నినో ప్రభావాన్ని చూపిస్తూ వ్యాపారులు ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గి వరి దిగుబడి పడిపోతుందని, బియ్యం కొరత ఏర్పడుతుందని ప్రచారం చేస్తూ వినియోగదారుల్లో భయాన్ని పెంచారు. దీంతో చాలామంది భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో ముందుగానే ఎక్కువ మొత్తంలో బియ్యం కొనుగోలు చేశారు. ఇదే అవకాశంగా భావించిన కొందరు వ్యాపారులు సన్నబియ్యం ధరలను భారీగా పెంచేశారు. కొన్ని రకాల బియ్యాన్ని కిలో రూ.100 వరకు విక్రయించిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ వ్యవహారంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం వివిధ రకాల సన్నబియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయించింది. అధికారిక ధరల పట్టిక ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం (కూనారం) రకాల బియ్యాన్ని కిలో రూ.66కు మించి అమ్మకూడదు. తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రకాల ధర కిలోకు రూ.74గా నిర్ణయించారు. ఇక హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్ రకాల బియ్యాన్ని కిలో రూ.79కు మించి విక్రయించకూడదని స్పష్టం చేశారు. ఈ ధరల వివరాలను ప్రతి బియ్యం దుకాణం ముందు కనిపించేలా బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేయించారు. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో బియ్యం మార్కెట్లో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. అధికారుల దాడులు, తనిఖీల నేపథ్యంలో వ్యాపారులు ధరలను తగ్గించడంతో ప్రస్తుతం వివిధ రకాల బియ్యంపై కిలోకు సగటున రూ.10 వరకు తగ్గుదల కనిపిస్తోంది. మార్కెట్లో తగినంత బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే బియ్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టికను పరిశీలించాలని సూచిస్తున్నారు. ఎవరైనా నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.