వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జాతీయం | రచన: Kalyan |

Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు షాక్.. పంబ నదిలో ఈ పని చేస్తే రూ.5 వేల జరిమానా..!

Sabarimala

శబరిమల అయ్యప్ప యాత్రకు వెళ్లే భక్తులు పంబ నదిలో బట్టలు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వేస్తే రూ.5,000 వరకు జరిమానా విధించనున్నారు. నదిలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం నవంబర్ 22 నుంచి జనవరి 20 వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. జరిమానా మొత్తాన్ని పంబ, శబరిమల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు వినియోగించనున్నారు.

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఇకపై పంబ నది దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి. పవిత్ర నదిలో బట్టలు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను పడేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పంబ నదిలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదిలో వస్త్రాలు, వ్యక్తిగత వస్తువులు, చెత్త వేస్తూ పట్టుబడితే ఏకంగా రూ.5,000 జరిమానా విధించనున్నారు. ఈ మేరకు శబరిమల ఏడీఎం దిలీప్ కె. కైనిక్కర నిషేధాజ్ఞలు జారీ చేశారు. నవంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆదేశాలు జనవరి 20 వరకు, అంటే మకరవిళక్కు సీజన్ ముగిసే వరకు అమలులో ఉంటాయి. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు పంబ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే స్నానం చేసిన తర్వాత తమ దుస్తులను నదిలోనే వదిలేయడం చాలామందికి అలవాటుగా మారింది. దీనివల్ల నదిలో భారీగా వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. నది పరిసరాలను శుభ్రం చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే సుమారు 25 టన్నుల పాత బట్టలను నది నుంచి తొలగించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంతకుముందు నెల రోజుల వ్యవధిలోనే పంబ, సన్నిధానం, నీలక్కల్ ప్రాంతాల నుంచి ఏకంగా 240 టన్నుల వస్త్ర వ్యర్థాలను సేకరించారు. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163, కేరళ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. నదులు, ఉపనదులు, వాటి పరిసరాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేస్తూ కాలుష్యానికి కారణమయ్యే వారిపై రూ.5,000 వరకు ఫైన్ విధిస్తారు. జరిమానా విధించిన 15 రోజుల్లోపు చెల్లించకపోతే కోర్టు విచారణతో పాటు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పంబ, నీలక్కల్, సన్నిధానం ప్రాంతాలకు వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ఈ నది తాగునీటి ప్రధాన వనరుగా ఉండటంతో నీరు కలుషితం కాకుండా, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఈ చర్యలు చేపడుతున్నారు. నిబంధనలను పర్యవేక్షించేందుకు పంబ డ్యూటీ మేజిస్ట్రేట్, పంబ పోలీస్ స్పెషల్ ఆఫీసర్, రాణి-పెరునాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. వీరు నదీ తీరాలు, స్నాన ఘట్టాలను తనిఖీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. భక్తులకు అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నియంత్రించనున్నారు. జరిమానాల రూపంలో వసూలైన డబ్బును గ్రామ పంచాయతీ నిధిలో జమ చేసి, పంబ–శబరిమల ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, నదిని శుభ్రం చేసే పనులకే వినియోగించనున్నారు. పవిత్రమైన పంబ నదిని కాపాడటం ప్రతి అయ్యప్ప భక్తుడి బాధ్యత అని, యాత్రకు వెళ్లేవారు ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.