Mega Wedding: మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి సందడి.. సాయిధరమ్ తేజ్ పెళ్లిపై ఆసక్తికర టాక్..!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్‌లో వివాహం జరగనుందనే ప్రచారంతో పాటు, చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా చర్చనీయాంశమైంది.
మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయా? సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నారా? ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే 2026లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తేజ్ గతంలో సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఆయన వివాహం గురించి మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. నవంబర్‌లోనే పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మెగా కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక సాయిధరమ్ తేజ్‌ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారట. అయితే ఆమె ఎవరనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఈ విషయాలపై అటు తేజ్ కానీ, మెగా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో అసలు పెళ్లి ఎప్పుడు? కాబోయే జీవిత భాగస్వామి ఎవరు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
గతంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు, ప్రేమ వ్యవహారం విఫలమైన తర్వాత తాను మానసికంగా కఠినమైన దశను ఎదుర్కొన్నట్లు సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమైతే.. తేజ్ జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది. అయితే ఈ వార్తలపై అధికారిక స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరోవైపు సినిమాల పరంగా కూడా సాయిధరమ్ తేజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'సంబరాల ఏటి గట్టు' అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆయన చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోంది.