వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఎంత పడతాయంటే..!

credit card
పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఎంత పడతాయంటే..! Photo: పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఎంత పడతాయంటే..!

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు డిసెంబర్ 1, 2026 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. నిర్దిష్ట రవాణా సేవలకు ఒక్కో లావాదేవీ రూ.30,000 దాటితే 1 శాతం రుసుము వర్తిస్తుంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో అర్హత కలిగిన ఇంధన ఖర్చు రూ.50,000 దాటితే మొత్తం ఫ్యూయల్ వ్యయంపై 1 శాతం ఛార్జీ విధిస్తారు.

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే డిసెంబర్‌ నుంచి మీ చెల్లింపుల విషయంలో ఓ కీలక మార్పును గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇంధనం, రవాణా సేవల కోసం ఎక్కువ మొత్తంలో కార్డుతో చెల్లించే వారు కొత్త నిబంధనలను గమనించాలి. నిర్దేశించిన పరిమితులు దాటితే అదనంగా 1 శాతం ఛార్జీ చెల్లించాల్సి రావచ్చు. అయితే ఇక్కడ ఇంధన కొనుగోళ్లకు, రవాణా చెల్లింపులకు ఒకే విధమైన లెక్కింపు ఉండదు. ఎస్‌బీఐ కార్డ్ ప్రకటించిన వివరాల ప్రకారం, రవాణా సేవలకు సంబంధించి ఒక్కో లావాదేవీ విలువ రూ.30,000 దాటితే 1 శాతం అదనపు రుసుము వర్తిస్తుంది. ఈ పరిమితిని నెల మొత్తం ఖర్చుతో కాకుండా, ఒక్కో చెల్లింపు ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు, రవాణా సేవల కోసం ఒకేసారి రూ.35,000 చెల్లిస్తే రూ.350 అదనపు ఛార్జీ పడుతుంది. అదే లావాదేవీ విలువ రూ.30,000 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఈ నిబంధన ప్రకారం అదనపు ఛార్జీ వర్తించదు. ఈ నిబంధన నిర్దిష్ట మర్చంట్ కేటగిరీ కోడ్‌ల (MCC) కింద నమోదయ్యే లావాదేవీలకు వర్తిస్తుంది. ఇంధన కొనుగోళ్ల విషయంలో మాత్రం లెక్కింపు భిన్నంగా ఉంటుంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో మొత్తం ఫ్యూయల్ ఖర్చు రూ.50,000 దాటితే, ఆ సైకిల్‌లో చేసిన మొత్తం ఇంధన చెల్లింపులపై 1 శాతం ఛార్జీ విధిస్తారు. ఉదాహరణకు, ఒక బిల్లింగ్ సైకిల్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కోసం కలిపి రూ.60,000 ఖర్చు చేస్తే, 1 శాతం ప్రకారం రూ.600 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు 2026 డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కాబట్టి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఇంధనం లేదా రవాణా సేవలకు అధిక మొత్తాల్లో చెల్లించేవారు తమ ఖర్చులను పరిశీలించుకోవడంతోపాటు, తమ కార్డుకు వర్తించే తాజా నిబంధనలను ఎస్‌బీఐ కార్డ్ అధికారిక ప్రకటనలో మరోసారి నిర్ధారించుకోవడం మంచిది.