డిసెంబర్ 14 నుంచి 8 రైళ్లు రద్దు, మరో 4 రైళ్ల వేళల్లో మార్పు..
మేడ్చల్–అకనాపేట సెక్షన్ డబ్లింగ్, మనోహరాబాద్ యార్డులో నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే డిసెంబర్ 14 నుంచి 22 వరకు 8 రైళ్లను పూర్తిగా రద్దు చేసి, మరో 4 రైళ్లను ఆలస్యంగా నడపనుంది. కాచిగూడ, సికింద్రాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్ మార్గాల్లోని రైళ్లతో పాటు ఇతర సెక్షన్లలోనూ కొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు ఉన్నాయి.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. మేడ్చల్–అకనాపేట రైల్వే సెక్షన్లో జరుగుతున్న డబ్లింగ్ పనుల్లో భాగంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ యార్డులో అదనపు రైల్వే లైన్ ఏర్పాటు, నాన్-ఇంటర్లాకింగ్ (NI) పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా 2026 డిసెంబర్ 14 నుంచి 22 వరకు 8 రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరో 4 రైళ్లను ఆలస్యంగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ వెల్లడించారు.
పూర్తిగా రద్దయిన 8 రైళ్లు: రైల్వే ప్రకటన ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు కాచిగూడ–నిజామాబాద్ (77601), నిజామాబాద్–కాచిగూడ (77602), సిద్దిపేట–సికింద్రాబాద్ (77656), కాచిగూడ–మెదక్ (57301), మెదక్–కాచిగూడ (57302) రైళ్లు రద్దయ్యాయి. అలాగే డిసెంబర్ 17 నుంచి 22 వరకు సికింద్రాబాద్–సిద్దిపేట (77653, 77655) మరియు సిద్దిపేట–సికింద్రాబాద్ (77654) రైళ్లను కూడా పూర్తిగా రద్దు చేశారు.
ఆలస్యంగా నడిచే 4 రైళ్లు: రద్దుతో పాటు నాలుగు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు చేశారు. భగత్ కీ కోఠి–కాచిగూడ (17606) రైలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు 75 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. సీఎస్టీ ముంబై–లింగంపల్లి (17057) రైలు డిసెంబర్ 15 నుంచి 21 వరకు 60 నిమిషాలు, లింగంపల్లి–సీఎస్టీ ముంబై (17058) మరియు కాచిగూడ–పూర్ణ (77605) రైళ్లు డిసెంబర్ 16 నుంచి 22 వరకు 60 నిమిషాల ఆలస్యంతో నడవనున్నాయి.
వీటితో పాటు నవీపేట్–జంకంపేట్, కాచిగూడ–డోన్ సెక్షన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనుల వల్ల దౌండ్–నిజామాబాద్ (11409), నిజామాబాద్–పండర్పూర్ (11413) రైళ్లను కొన్ని తేదీల్లో పాక్షికంగా రద్దు చేయగా, కర్నూలు సిటీ–కాచిగూడ (17024) రైలు కొన్ని తేదీల్లో 60 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే రైల్వే అధికారిక వెబ్సైట్ లేదా NTES యాప్ ద్వారా తాజా వివరాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.