Tamil Nadu: జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. పోలీసులకు భారీ షాక్..!
తమిళనాడులోని తేని జిల్లా సబ్‌జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు జైలు సిబ్బందిపై దాడి చేసి పరారయ్యారు. ఘటన తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
తమిళనాడులోని తేని జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది. ఆండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి సబ్‌జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు ఒకేసారి పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. జైలు సిబ్బందిపై దాడి చేసి ఖైదీలు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖైదీల్లో ఒకరు అనారోగ్యంగా ఉన్నారని చెప్పడంతో సిబ్బంది వారి సెల్ వద్దకు వెళ్లగా, వారిపై దాడి చేసి మూకుమ్మడిగా బయటకు పారిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో గాయపడిన జైలు సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు.
ఖైదీలు పరారైన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పొరుగున ఉన్న దిండిగల్ జిల్లాలో 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మదురై, దిండిగల్‌తో పాటు కేరళలోని ఇడుక్కి ప్రాంత పోలీసులనూ అప్రమత్తం చేశారు. పారిపోయిన వారిలో కొందరు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానంతో సరిహద్దుల్లో నిఘా పెంచారు.
తాజా సమాచారం ప్రకారం, పారిపోయిన ఖైదీల్లో కొందరిని పోలీసులు తిరిగి పట్టుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. మిగిలిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన జైలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఖైదీలు ఎలా తప్పించుకున్నారు? భద్రతా సిబ్బందిపై దాడికి ముందుగా ఏదైనా ప్రణాళిక వేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.