Education: తెలంగాణలో మారనున్న చదువుల విధానం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త రూల్స్..!
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
తెలంగాణలో స్కూల్ విద్యా విధానం మారబోతోందా..? ఇప్పటివరకు కొనసాగుతున్న చదువుల పద్ధతిలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యాశాఖపై బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు మారుతున్న కాలానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
కొత్త విద్యా సంస్కరణల్లో భాగంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువును ఉన్నత విద్యకు కీలకమైన దశగా పరిగణించి, విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం సూచించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే వృత్తి విద్యా నైపుణ్యాలను కూడా నేర్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కొత్త విధానం అమలు చేసే సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, ఎవరికీ నష్టం జరగకుండా దశలవారీగా మార్పులు తీసుకురావాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కొత్త విధానంలో తరగతుల నిర్వహణ, సిలబస్, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వం మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.