వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Pallavi |

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. తనఖాలో ఉన్న ఇంటి పట్టాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం!

తెలంగాణలో 7 లక్షల కుటుంబాలకు గుడ్‌న్యూస్..

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, వాంబే వంటి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు పొందిన సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తనఖాలో ఉన్న వారి ఒరిజినల్ ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయగా, అన్ని జిల్లాల కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. దీంతో ఏళ్లుగా ఇంటి పత్రాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఊరట లభించనుంది.

తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు పొందిన సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు తనఖాలో ఉన్న ఒరిజినల్ ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏళ్ల తరబడి తమ ఇంటి పత్రాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఈ నిర్ణయంతో ఊరట లభించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, వాంబే వంటి పలు గృహ నిర్మాణ పథకాలు అమలయ్యాయి. ఈ పథకాల ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేది. ఇందులో ప్రభుత్వ సబ్సిడీతో పాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణాలు ఉండేవి. రుణాలు పొందే సమయంలో లబ్ధిదారులు తమ ఇంటి ఒరిజినల్ పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తనఖా కింద అధికారులకు అప్పగించారు. రుణాల వాయిదాలు పూర్తిగా చెల్లించిన తర్వాత ఆ పత్రాలను తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో చాలా మంది లబ్ధిదారులకు ఆ పత్రాలు అందలేదు. దీంతో పదేళ్లకు పైగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే వాటిని భద్రపరిచారు. ఇటీవల సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. లబ్ధిదారుల ఇబ్బందులను గుర్తించిన సీఎం.. అసలు పత్రాలను తిరిగి అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. లబ్ధిదారులకు ఏమిటి ప్రయోజనం? ఇంటి ఒరిజినల్ పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు చేతికి రావడంతో లబ్ధిదారులకు తమ ఆస్తికి సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంటాయి. ఆస్తి వివరాల నిర్ధారణ, వారసత్వ బదలాయింపు, ఇతర అవసరాల సమయంలో ఈ పత్రాలు ఉపయోగపడతాయి. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పత్రాలను వారికి అందజేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం లభించనుంది.