Good News: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా..!
తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించేందుకు సిద్ధమైంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని నిర్ణయించింది. అదే రోజు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. పథకం కోసం ఆన్లైన్, యాప్ ద్వారా నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు.
తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించనుండగా.. అదే రోజు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులు కలిగిన అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా మొత్తం అందించనున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా కొంతమేర అండగా నిలవాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియ నవంబర్ 19 నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి నమోదు చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు తమ సమీప గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చని సమాచారం. ఇందుకోసం ప్రత్యేక యాప్‌తో పాటు ఆన్లైన్ నమోదు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మరో కీలక నిర్ణయంగా.. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న జీవిత బీమా పథకాలన్నింటినీ ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నేత, గౌడ, కార్మిక, మత్స్యకార వర్గాలకు అందిస్తున్న రూ.2 లక్షల జీవిత బీమా రక్షణను కూడా ఇందిరమ్మ కుటుంబ బీమా పరిధిలోకి తీసుకొచ్చి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే ఆయా వర్గాల కుటుంబాలకు మరింత మెరుగైన ఆర్థిక భద్రత లభించనుంది. మొత్తంగా కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవడమే ఈ పథకం లక్ష్యంగా కనిపిస్తోంది.