వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Pallavi |

తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా!

భీమా పథకం..

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు అర్హులైన కుటుంబాల వివరాల నమోదు చేపట్టనున్నారు.

తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ పథకం అండగా నిలవనుంది. ఈ పథకం ద్వారా కుటుంబంలోని ఒక సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల వరకు జీవిత బీమా కల్పించనున్నారు. ఆ వ్యక్తి మరణిస్తే ఎంపిక చేసిన నామినీలకు బీమా మొత్తం అందుతుంది. కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తున్నట్లయితే ఆ వ్యక్తికి బీమా వర్తిస్తుంది. ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న కుటుంబాలు తమకు నచ్చిన వ్యక్తిని బీమా కోసం ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే అవకాశం కూడా ఉంది. బీమా సొమ్మును నామినీలకు ఏ నిష్పత్తిలో అందించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన నమోదు ప్రక్రియను నవంబర్ 19న సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకం అమలుకు అయ్యే బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో లబ్ధిదారులు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కుటుంబ వివరాలు, బీమా పొందే వ్యక్తి వివరాలు, నామినీల వివరాలను అధికారులు నమోదు చేస్తారు. దరఖాస్తులో పేర్కొన్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చదివి వినిపించి, వారి అంగీకారం తీసుకున్న తర్వాతే సంతకాలు పొందాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే వ్యక్తిని కోల్పోయినప్పుడు మిగిలిన సభ్యులు ఇబ్బందులు పడకుండా ఈ బీమా సొమ్ము ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగిస్తూ జీవిత బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచేలా చర్యలు చేపడుతోంది. గమనిక: దరఖాస్తు అర్హతలు, అవసరమైన పత్రాలపై స్థానిక నమోదు కేంద్రాలు లేదా అధికారుల సూచనలను పరిశీలించాలి.