Revanth Reddy: తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. అసలు టార్గెట్ ఇదే..!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలో జాప్యానికి తావులేదని, విధానపరమైన స్తబ్దత లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 5 శాతంగా ఉండగా, భవిష్యత్తులో దాన్ని 10 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రక్షణ రంగం, ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ భద్రత, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు వివరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని రాష్ట్రాలు, రంగాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగతించారు. సుమారు 700 ఏళ్ల క్రితమే కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు మోటుపల్లి శాసనం ద్వారా నౌకా వాణిజ్యానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారని గుర్తుచేశారు. పెట్టుబడుల భద్రత, విధానాల్లో స్థిరత్వం అప్పటిలాగే ఇప్పటికీ వ్యాపారులకు ముఖ్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ వేగంగా వృద్ధి సాధిస్తోందని, ఎగుమతులను పెంచడంలోనూ పురోగతి సాధించిందని తెలిపారు.
హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఏఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని పీయూష్ గోయల్ అన్నారు. తాండూరు కందులు, నిజామాబాద్ పసుపు వంటి తెలంగాణ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచించారు. ఫార్మా, బయోటెక్తోపాటు ఏరోస్పేస్, రక్షణ, క్వాంటం కంప్యూటింగ్ రంగాలపై దృష్టి సారించాలని తెలిపారు. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేస్తే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన పెరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు.