వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Pallavi |

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్!

ఐపీఎస్ అధికారుల బదిలీలు..

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్ నియమితులవగా, వీసీ సజ్జనార్‌కు ఫైర్ సర్వీసెస్ డీజీపీ బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, కొత్త పోస్టింగులు కల్పించింది. పోలీస్ శాఖతో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక బాధ్యతలను అధికారులకు అప్పగించింది. నవంబర్ 12న సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో ప్రధానంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. 1995 బ్యాచ్‌కు చెందిన మహేష్ భగవత్.. ఇప్పటివరకు పోలీస్ శాఖలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌కు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఆయనను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీపీగా నియమించారు. అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) డీజీపీ బాధ్యతలను కూడా అప్పగించారు. డీజీపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్‌గా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా నియమించారు. పోలీస్ ఆర్గనైజేషన్, పోలీస్ లీగల్ సర్వీసెస్ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆమె స్థానంలో స్వాతి లక్రాను డీజీపీ ప్రిజన్స్‌గా నియమించారు. హోంగార్డ్స్ విభాగం అదనపు బాధ్యతలను కూడా ఆమెకు ఇచ్చారు. చారు సిన్హాను అవినీతి నిరోధక శాఖ (ACB) డీజీపీగా నియమించారు. ఆమె సీఐడీ డీజీపీ అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు. డాక్టర్ అనిల్ కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. వై. నాగిరెడ్డికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలతో తెలంగాణ పోలీస్, పరిపాలనా విభాగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.