Weather Alert: తెలంగాణలో మళ్లీ వానలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు అలర్ట్..!
తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేయగా.. మరోసారి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి.
తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేయగా.. మరోసారి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు హైదరాబాద్ నగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షం రోడ్లను జలమయం చేసింది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే శనివారం నగరంలో వర్ష తీవ్రత అంతకుముందు రోజుతో పోలిస్తే తక్కువగా ఉండొచ్చని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ అంచనా వేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలులు వీచే సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని, నీరు నిలిచిన రహదారులపై జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు.
రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తమ వ్యవసాయ ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నవంబర్ 1, 2 తేదీల్లోనూ తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తాజా వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి ప్రజలు స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.