వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. అటు పెరుగుతున్న చలి.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం..!

Weather Alert

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే చలి ప్రభావం మొదలై ప్రజలు వెచ్చని దుస్తులు బయటకు తీస్తుండగా.. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉండగా.. మరికొన్ని చోట్ల చలి తీవ్రత పెరగడంతో పాటు ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు వాతావరణ శాఖలో ఆసక్తి రేపుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు యానాం ప్రాంతాలపై కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలికలు, తీవ్రత ఎలా ఉంటాయనే దానిపై వర్షాల విస్తృతి ఆధారపడి ఉంటుంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వాతావరణంలో గాలుల దిశ మార్పు కనిపిస్తోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు తెలంగాణలో చలి పంజా విసరడం మొదలుపెట్టింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరింత చల్లగా ఉంటోంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజులు వర్షాలు, చలి, పొగమంచుతో గడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవచ్చు కాబట్టి వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలి. అల్పపీడనం కదలికలను బట్టి వర్షాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.