TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మంత్లీ పాస్‌లో కీలక మార్పులు.. ఇక ఆదివారం ఫ్రీ..!
తెలంగాణ ఆర్టీసీ మంత్లీ సీజన్ టికెట్లలో కీలక మార్పులు చేసింది. దూర పరిమితిని తొలగించడంతో పాటు నగరాల్లో ఆదివారం ఉచిత ప్రయాణం, మహిళలకు ప్రత్యేక రాయితీ, కాంబి టికెట్ సదుపాయం, రెండు, మూడు నెలల పాస్‌లపై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది.
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రోజువారీ ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలిగేలా టీజీఎస్ ఆర్టీసీ నెలవారీ సీజన్ టికెట్ల నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న మంత్లీ సీజన్ టికెట్ డిస్టెన్స్ పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన రూట్, ఛార్జీల నిబంధనలకు అనుగుణంగా ఇకపై దూర పరిమితితో సంబంధం లేకుండా నెలవారీ పాస్‌లు పొందవచ్చు. మరోవైపు పాస్ ధరల భారం తగ్గించేందుకు టోల్ ప్లాజా ఛార్జీలను 25 రోజులకు బదులుగా 20 రోజులకే లెక్కించనున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం కొత్తగా డీలక్స్ మంత్లీ సీజన్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటితో ఇ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు.
మంత్లీ పాస్ తీసుకునే వారికి మరో ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా ఆర్టీసీ కల్పిస్తోంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో నడిచే అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఆదివారాలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు ఈ వెసులుబాటు వర్తించదు. ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా బస్సులు మార్చుకునేందుకు కాంబి టికెట్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. ప్రతి ప్రయాణానికి అదనంగా రూ.20 చెల్లించి ఈ టికెట్ పొందవచ్చు. పల్లెవెలుగు పాస్ ఉన్నవారు ఎక్స్‌ప్రెస్, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎక్స్‌ప్రెస్ పాస్ హోల్డర్లు డీలక్స్, ఇ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే పల్లెవెలుగు పాస్‌తో డీలక్స్, ఇ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించడానికి అనుమతి లేదు.
ఇక తమకు కేటాయించిన రూట్ కాకుండా తెలంగాణలోని ఇతర మార్గాల్లో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లకు కూడా ప్రయోజనం కల్పిస్తోంది. సూపర్ లగ్జరీ, ఆపై స్థాయి బస్సుల బేసిక్ టికెట్ ఛార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వనుంది. ఎక్కువ కాలానికి పాస్ తీసుకునేవారికి అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. రెండు నెలల మంత్లీ సీజన్ టికెట్ కొనుగోలు చేస్తే అదనంగా ఐదు రోజులు, మూడు నెలల పాస్ తీసుకుంటే మరో పది రోజుల వ్యాలిడిటీ ఉచితంగా లభిస్తుంది. దీంతో తరచూ ప్రయాణించే వారికి కొంత మేర ఖర్చు తగ్గనుంది.
మహిళా ప్రయాణికులకు అయితే ఆర్టీసీ మరింత ప్రత్యేక రాయితీ ప్రకటించింది. మహిళలు తీసుకునే సీజన్ టికెట్ల ఛార్జీలను, టోల్ ఛార్జీలతో సహా, ప్రస్తుతం ఉన్న 20 రోజులకు బదులుగా 15 రోజులకే లెక్కించనున్నారు. దీంతో వారికి పాస్ ధరలో మరింత ఆదా కానుంది. ఇలా మంత్లీ పాస్‌లపై పలు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీజీఎస్ ఆర్టీసీ.. విద్యార్థులు, ఉద్యోగులు, నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుతోంది.