Tirumala Darshan: వీఐపీ టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబం.. క్యూలైన్ వద్ద ఊహించని షాక్..!
శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను నమ్మి వీఐపీ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్లు చేతిలో ఉండటంతో స్వామివారి దర్శనం సులభంగా పూర్తవుతుందని భావించారు.
శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను నమ్మి వీఐపీ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్లు చేతిలో ఉండటంతో స్వామివారి దర్శనం సులభంగా పూర్తవుతుందని భావించారు. కానీ తిరుమలలోని దర్శన కౌంటర్ వద్దకు వెళ్లాక అసలు విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. తాము కొనుగోలు చేసిన టికెట్లు నకిలీవని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక నిరాశతో వెనుదిరిగారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఈ కుటుంబం ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు భక్తులకు హెచ్చరికగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వై. యల్లయ్య మొబైల్‌కు ఈ నెల 5న వాట్సాప్ గ్రూప్ ద్వారా ఓ లింక్ వచ్చింది. టీటీడీ అధికారిక లోగోతో కనిపించిన ఆ లింక్‌ను చూసి ఆయన నమ్మినట్లు తెలుస్తోంది. దాని ద్వారా స్వామివారి వీఐపీ దర్శనం టికెట్లు సులభంగా పొందవచ్చని భావించారు. మరో వ్యక్తి సహాయంతో లింక్‌ను ఓపెన్ చేసి, ఒక్కో టికెట్‌కు రూ.500 చొప్పున మూడు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్‌కు వచ్చిన కన్ఫర్మేషన్ స్లిప్పులను జిరాక్స్ సెంటర్‌లో ప్రింట్ తీసుకున్నారు.
ఆ టికెట్లపై అక్టోబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు దర్శన సమయం కేటాయించినట్లు ఉండటంతో కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు బయలుదేరారు. నిర్ణీత సమయానికి వీఐపీ దర్శన కౌంటర్ వద్దకు చేరుకుని తమ వద్ద ఉన్న ప్రింట్లను సిబ్బందికి చూపించారు. అయితే వాటిని పరిశీలించిన టీటీడీ సిబ్బంది అవి దేవస్థానం జారీ చేసిన అసలైన టికెట్లు కావని స్పష్టం చేశారు. అవి నకిలీ టికెట్లని తెలియడంతో కుటుంబసభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సర్వదర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండటంతో వెనుదిరిగి స్వగ్రామానికి చేరుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితుడు వై. యల్లయ్య తిరుమల పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీటీడీ పేరుతో వచ్చిన లింక్‌ను నమ్మి మోసపోయిన తన అనుభవాన్ని వివరిస్తూ, ఇతర భక్తులు ఇలాంటి పొరపాటు చేయవద్దని సూచించారు. అధికారికంగా కనిపించే లోగోలు, సందేశాలు ఉన్నంత మాత్రాన అవి నిజమైనవని నమ్మకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, వాట్సాప్ లింక్‌ల ద్వారా భక్తులను మోసం చేసే అవకాశాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
టీటీడీ పేరుతో వచ్చే అనధికారిక లింక్‌లను క్లిక్ చేయవద్దని, దళారులను నమ్మి దర్శన టికెట్లు కొనుగోలు చేయవద్దని భక్తులకు సూచిస్తున్నారు. టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారికంగా ప్రకటించిన బుకింగ్ మార్గాల ద్వారానే పొందాలి. ఏదైనా లింక్‌పై అనుమానం ఉంటే అందులో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం నమోదు చేయకుండా ముందుగా దాని అధికారికతను నిర్ధారించుకోవాలి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే ముందు టికెట్ల వివరాలను సరిచూసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.