Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి దర్శన టికెట్లు ఎప్పుడంటే.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, వసతి గదుల కోటాను విడతలవారీగా ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు విడతలవారీగా ఆన్లైన్లో టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఫిబ్రవరిలో తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు ఇప్పటి నుంచే బుకింగ్ షెడ్యూల్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ తేదీన ఏ టికెట్ విడుదలవుతుంది? ఎప్పుడు బుక్ చేసుకోవాలి? తెలుసుకుందాం.
ముందుగా నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో విడుదల చేయనున్నారు. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు ఉన్నాయి. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లు పొందినవారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత మొత్తాన్ని చెల్లించి బుకింగ్‌ను ఖరారు చేసుకోవాలి.
ఇక నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల టికెట్లు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. నవంబర్ 23వ తేదీ కూడా భక్తులకు కీలకమే. ఆ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక నవంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో దర్శనంతో పాటు గది కూడా ముందుగానే బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ఈ తేదీని గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవచ్చు. టికెట్ల విడుదల సమయంలో వెబ్సైట్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల భక్తులు ముందుగానే తమ రిజిస్ట్రేషన్ వివరాలను సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా టికెట్ల కోసం ఇతర అనధికారిక లింకులను నమ్మకుండా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలి.