Tirumala: చేతిలో ధనుస్సు, బాణం.. హనుమంతుడిపై కొలువుదీరిన కోదండ రాముడు..!
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో ధనుస్సు, బాణం ధరించి స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
ఒకవైపు కోదండ రాముడి దివ్య మంగళరూపం.. మరోవైపు ఆ శ్రీరాముడిని తన హృదయంలో కొలువుదాచుకున్న ఆంజనేయుడు. తిరుమలలో ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం భక్తులను పరవశింపజేసింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణం ధరించిన స్వామివారి దివ్యరూపాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
తిరుమల మాడ వీధుల్లో హరినామ సంకీర్తనలు మార్మోగాయి. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య హనుమంత వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణతో తిరుమల పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
హనుమంతుడు కేవలం అపార బలశాలి మాత్రమే కాదు.. శ్రీరాముడిపై అచంచలమైన భక్తి, నిస్వార్థ సేవ, సంపూర్ణ అంకితభావానికి ప్రతీక. జ్ఞానం, ధైర్యం, వినయం కలగలిసిన ఆంజనేయుడిపై శ్రీ మలయప్పస్వామివారు విహరించడం ఈ వాహనసేవకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న అనుబంధాన్ని, ధర్మాన్ని కాపాడటంలో సేవాభావం ఎంత గొప్పదో ఈ అలంకారం గుర్తుచేసింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పుష్పక విమాన వాహనసేవ జరగనుంది. రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి విభిన్న వాహనసేవలను తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నరేష్ కుమార్, శాంతారామ్, రంగశ్రీ, జానకీ దేవి, సదాశివమ్, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.