వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Pallavi |

తిరుమలలో నవమి వాహన సేవలు.. అశ్వవాహనంపై కల్కి అవతారంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామి!

అశ్వవాహనంపై కల్కి అవతారంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామి!

తిరుమల శ్రీవారి నవratri బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి శ్రీవేంకటేశ్వరస్వామివారు అశ్వవాహనంపై కల్కి అవతారంలో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారి మాడ వీధుల్లో అశ్వవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. జగద్రక్షకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారు అశ్వవాహనంపై అధిరోహించి, కల్కి అవతారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చి కటాక్షించారు. స్వామివారి అభయప్రదానాన్ని దర్శించి, నవమి నాటి వాహన సేవలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు మురిసిపోయారు. అంతకుముందు, ఉదయం వేళ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు భవ్యమైన స్వర్ణరథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరించారు. వేదమంత్రాల ఘోష, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ స్వర్ణరథోత్సవంలో గోవింద నామస్మరణతో తిరుగిరులు మారుమోగాయి. స్వామివారి వైభవాన్ని కళ్లారా తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తజనం మాడ వీధుల్లో వేచి ఉండి, నీరాజనాలు అర్పించారు. ఈ దివ్య వాహన సేవల్లో తిరుమల పెద్ద జీయ్యంగార్లు, చిన్న జీయ్యంగార్లులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర మరియు ఇతర ముఖ్య అధికారులు, అర్చకులు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సకల సౌకర్యాలను సమన్వయం చేశారు. నవరాతి బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీవారి చక్రస్నాన మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం వేళ తెల్లవారుజామున పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం పుష్కరిణి తీరంలో శ్రీవారి చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా అర్చకులు స్నాపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ పవిత్ర చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో స్నానం చేయడం అత్యంత పుణ్యఫలదాయకమని భక్తుల విశ్వాసం.