Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. ఈసారి మరో 51 వేల మందికి అవకాశం..!
తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. గతేడాది కంటే అదనంగా 51 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి మూడు రోజులు డిప్ విధానం, తర్వాత ఏడు రోజులు సర్వదర్శనం ద్వారా భక్తులను అనుమతించనున్నారు. సమావేశంలో తిరుపతిలో రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలను డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ఎం. రవిచంద్ర తెలిపారు. గతేడాది కంటే ఈసారి మరో 51 వేల మంది భక్తులకు అదనంగా దర్శనం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బుధవారం తిరుమలలో తన అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. గతేడాది వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో మొత్తం 7.45 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.
దర్శనాల విధానంలోనూ కీలక మార్పులు చేపట్టనున్నారు. మొదటి మూడు రోజులు మాత్రమే డిప్ విధానం ద్వారా భక్తులకు దర్శనాలు కల్పిస్తామని రవిచంద్ర వెల్లడించారు. మిగిలిన ఏడు రోజుల పాటు సర్వదర్శనం ద్వారా భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. మరోవైపు తిరుపతికి వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మించనున్నట్లు చెప్పారు. తిరుమల, తిరుపతిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్లకు వెళ్లే రహదారిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో నెయ్యి ఉత్పత్తి కోసం రూ.7.7 కోట్లతో 500 ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తిరుమల, తిరుపతి పరిసరాల్లో వన్యప్రాణుల సంరక్షణకు రెండేళ్ల కాలానికి రూ.16.4 కోట్ల నిధులు కేటాయించనున్నారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల కానుకగా రూ.16,940 చొప్పున అందించాలని నిర్ణయించినట్లు రవిచంద్ర తెలిపారు. ఇందులో సగం మొత్తాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అందించనున్నట్లు వివరించారు. వేద పారాయణదారులతో పాటు ప్రబంధం చేసే వారి వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇక వైద్య సేవల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో వైద్య పరికరాలకు సంబంధించి ఉన్న బకాయిల చెల్లింపుల కోసం రూ.41.2 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. శిల్ప కళాశాలలో హాస్టల్ సౌకర్యాల అభివృద్ధికి రూ.23 కోట్లు, టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల ఖర్చుల కోసం రూ.80 కోట్లను నిర్ణయించినట్లు రవిచంద్ర పేర్కొన్నారు. మొత్తంగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లతో పాటు భక్తుల సౌకర్యాలు, ఉద్యోగుల సంక్షేమం, వైద్య సేవలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై టీటీడీ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది.