వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 7 నుంచి ఉచితంగా లడ్డూ, వడ ప్రసాదం..!

ttd

టీటీడీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు టీటీడీ శుభవార్త అందించింది. నవంబర్ 7 నుంచి 20వ తేదీ వరకు అర్హులకు ఉచితంగా ఒక పెద్ద శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని పంపిణీ చేయనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలో ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు స్వామివారి వైభవాన్ని కళ్లారా చూసిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఈ వేడుకల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి టీటీడీలో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు శ్రీవారి ప్రసాదాన్ని ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అర్హులైన వారికి పెద్ద లడ్డూతో పాటు వడ ప్రసాదాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేయనుంది. ప్రతి ఏడాది కొనసాగిస్తున్న సంప్రదాయంలో భాగంగా ఈసారి కూడా నవంబర్ 7 నుంచి 20వ తేదీ వరకు ప్రసాదాల పంపిణీ చేపట్టనుంది. తిరుపతిలోని కేటీ రోడ్డులో ఉన్న టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలో, ఉద్యోగుల క్యాంటీన్ సమీపంలోని కొత్త జాబాలి భవనం వద్ద ఈ పంపిణీ జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద లడ్డూతో పాటు వడను అందజేస్తారు. అయితే అందరూ ఒకేసారి రావాల్సిన అవసరం లేదు. రద్దీని తగ్గించేందుకు టీటీడీ పీపీఓ నంబర్ల ఆధారంగా ప్రత్యేక తేదీలను కేటాయించింది. నవంబర్ 7న పీపీఓ నంబర్ 164 నుంచి 3,250 వరకు ఉన్నవారికి ప్రసాదం అందిస్తారు. నవంబర్ 9 నుంచి 13 వరకు 3,251 నుంచి 9,050 నంబర్ల వారికి పంపిణీ ఉంటుంది. నవంబర్ 16 నుంచి 19 వరకు 9,051 నుంచి 12,550 నంబర్ల వారికి, నవంబర్ 20న 12,551 నుంచి ఆ తర్వాతి నంబర్లు ఉన్నవారికి ప్రసాదాలు అందజేస్తారు. ప్రసాదం తీసుకోవడానికి వెళ్లే విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. తమ ఒరిజినల్ స్మార్ట్ కార్డును వెంట తీసుకెళ్లాలి. కౌంటర్ వద్ద స్మార్ట్ కార్డు చూపించిన తర్వాతే లడ్డూ, వడ ప్రసాదాలను అందజేస్తారు. కాబట్టి కేటాయించిన తేదీకి వెళ్లేటప్పుడు కార్డును మర్చిపోకుండా చూసుకోవాలి. మరోవైపు వయోవృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వేచి ఉండేందుకు షెడ్లు, తాగునీటి సదుపాయాలను కల్పించింది. ఏళ్ల తరబడి స్వామివారి సేవలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబాలకు శ్రీవారి ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అర్హులైన వారు తమ పీపీఓ నంబర్‌కు కేటాయించిన రోజునే తిరుపతికి వెళ్లి ఉచితంగా ప్రసాదాలను పొందవచ్చు.