TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ నుంచి వరుస ప్రకటనలు.. ఈ తేదీలు మిస్ కావద్దు!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటనలు చేసింది. నవంబర్ 23 నుంచి 25 వరకు 115 లాట్ల న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఆన్‌లైన్‌లో వేలం వేయనుంది. ఫిబ్రవరి నెల దర్శన, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించడంతో పాటు నవంబర్ 24న తిరుపతిలోని గోవిందరాజస్వామి, కోదండరామాలయాల్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహించనుంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ కీలక అప్డేట్స్ అందించింది. మరోవైపు శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ-వేలం నిర్వహించనుంది. మొత్తం 115 లాట్ల చీరలను వేలం వేయనుండగా, ఈ-వేలం ఐడీ నంబర్లు 28814 నుంచి 28819 వరకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొనవచ్చు. వేలానికి సంబంధించిన వివరాలను తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్ మేనేజర్ (వేలములు) కార్యాలయం లేదా ఏఈవో (వేలములు) కార్యాలయంలో తెలుసుకోవచ్చు. అలాగే కొనుగోలు పోర్టల్, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా 0877-2264429 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
ఇక తిరుమల శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా టీటీడీ ప్రకటించింది. నవంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
నవంబర్ 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుండగా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు టికెట్లు, సేవలు, దర్శనాలు, వసతి గదులను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. దర్శనానికి వెళ్లాలనుకునేవారు టికెట్ల విడుదల తేదీ, సమయాలను ముందుగానే గుర్తుంచుకుని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం మంచిది.
ఇదిలా ఉంటే, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబర్ 24న కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి గోవిందరాజస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించనున్నారు. అదే రోజు తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలోనూ కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు గోవిందరాజస్వామివారి ఆలయంలోని పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ మర్యాదలతో పడి, కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా కోదండరామాలయానికి తీసుకెళ్లి దీపాలను వెలిగించనున్నారు. దీంతో తిరుపతిలోని రెండు ప్రముఖ ఆలయాల్లో కార్తీక దీపోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి.