వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జ్యోతిష్యం | రచన: Pallavi |

తులసి వివాహం వెనుక ఆసక్తికరమైన పురాణ కథ.. విష్ణుమూర్తిని వృంద ఎందుకు శపించింది?

తులసి వివాహం వెనుక ఆసక్తికరమైన పురాణ కథ..

కార్తీక శుక్ల ద్వాదశి రోజున నిర్వహించే తులసి వివాహానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వృంద, జలంధరుడు, శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పురాణ కథ ఈ ఆచారం వెనుక ఉంది. తులసి, శాలిగ్రామాల వివాహం జరిపించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి రోజున తులసి వివాహాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. 2026లో నవంబర్ 21, శనివారం తులసి వివాహ వేడుక జరగనుంది. ఈ రోజున తులసి అమ్మవారికి, శ్రీమహావిష్ణువు శాలిగ్రామ రూపానికి సంప్రదాయబద్ధంగా వివాహం చేస్తారు. అయితే ఈ ఆచారం వెనుక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. వృంద, జలంధరుడి కథ ఇదే.. పురాణాల ప్రకారం.. వృంద అనే మహిళ శ్రీమహావిష్ణువుకు గొప్ప భక్తురాలు. ఆమె జలంధరుడు అనే రాక్షస రాజును వివాహం చేసుకుంది. భర్తపై వృందకు ఉన్న అపారమైన పాతివ్రత్యం, తపోబలం కారణంగా జలంధరుడు అత్యంత శక్తిమంతుడిగా మారాడు. అతడిని ఓడించడం దేవతలకు కూడా సాధ్యం కాలేదు. దీంతో దేవతలంతా శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. జలంధరుడిని ఓడించాలంటే వృంద పాతివ్రత్యాన్ని భంగం చేయాలని విష్ణుమూర్తి నిర్ణయించుకున్నట్లు పురాణ కథనం. అందులో భాగంగా జలంధరుడి రూపంలో వృంద వద్దకు వెళ్లాడు. తన భర్తే వచ్చాడని భావించిన వృంద ఆయనను గుర్తించలేకపోయింది. దీంతో జలంధరుడి శక్తి తగ్గి, యుద్ధంలో ఓడిపోయాడు. తనకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న వృంద తీవ్ర ఆవేదనకు గురైంది. కోపంతో విష్ణుమూర్తిని రాయిగా మారిపోవాలని శపించింది. ఆ శాపం కారణంగా శ్రీమహావిష్ణువు శాలిగ్రామ శిల రూపాన్ని ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం వృంద ప్రాణాలు విడిచిన తర్వాత ఆమె చితాభస్మం నుంచి తులసి మొక్క ఆవిర్భవించిందని కథనం. వృంద భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెకు వరం ప్రసాదించాడు. తులసి తనకు అత్యంత ప్రియమైనదని, తులసి దళాలు లేని తన పూజ అసంపూర్ణమని తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి, శాలిగ్రామాల వివాహం నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైందని విశ్వసిస్తారు. తులసి వివాహం జరిపించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని, వివాహం కానివారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారని విశ్వసిస్తారు. ఈ వేడుకలో తులసి మొక్కను పెళ్లికూతురిలా అలంకరించి, శాలిగ్రామ స్వామికి పూజలు చేసి వివాహం జరిపిస్తారు. ఈ కథనం పురాణాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడింది.