Inspiring Story: గుడి ముందు అడుక్కునే మహిళ.. అదే గుడికి రూ.50 వేలు విరాళం.. ఆమె గొప్ప మనసుకు హ్యాట్సాఫ్..!
కాకినాడ జిల్లా తునికి చెందిన నర్సియమ్మ అనే వృద్ధురాలు భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును పొదుపు చేసి దేవాలయాలకు విరాళాలు అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తాజాగా కార్తీకమాసం సందర్భంగా తునిలోని విశ్వేశ్వర స్వామి ఆలయానికి రూ.50 వేల విరాళం ఇచ్చారు.
దానం చేయాలంటే చేతిలో కోట్లు ఉండాల్సిన అవసరం లేదు.. సాయం చేయాలనే మంచి మనసుంటే చాలని ఓ వృద్ధురాలు నిరూపిస్తున్నారు. రోజూ గుడి ముందు భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుతో తన జీవనం సాగించే ఆమె.. అదే సంపాదనలో కొంత పొదుపు చేసి దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అందిస్తున్నారు. పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లోనూ ఇతరుల కోసం ఆలోచిస్తున్న ఆమె దాతృత్వం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాకినాడ జిల్లా తునికి చెందిన ఈ వృద్ధురాలి మంచి మనసు గురించి తెలుసుకున్న స్థానికులు ఆమెను ప్రశంసిస్తున్నారు.
తుని పట్టణంలోని ప్రసిద్ధ ధారాలమ్మ ఆలయ ప్రాంగణంలో నివసించే నర్సియమ్మ అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి చుట్టుపక్కల దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భక్తులు ఇచ్చే చిల్లర నాణేలు, డబ్బులతోనే వారి రోజువారీ అవసరాలు తీరుతుంటాయి. అయితే వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకుండా.. తమ అవసరాలకు కొంత తీసుకుని మిగిలిన మొత్తాన్ని జాగ్రత్తగా దాచుకుంటారు. అలా పైసాపైసా కూడబెట్టిన సొమ్మును దేవాలయాల అభివృద్ధి, ఇతర సేవా కార్యక్రమాల కోసం విరాళంగా అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
కార్తీకమాసం సందర్భంగా నర్సియమ్మ తాజాగా తుని పట్టణంలోని గాంధీ సత్రం ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయానికి రూ.50 వేల నగదు విరాళంగా అందించారు. ఎంతో కష్టపడి పొదుపు చేసిన మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఆమె ఇచ్చిన విరాళం చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆలయ అధ్యక్షుడు సత్తిబాబు, కార్యదర్శి పల్లెల నాగేశ్వరరావు, అర్చకులు సంతోష్, సేవకులు నారాయణ స్థానికులకు తెలియజేశారు. భిక్షాటన చేసి జీవనం సాగించే మహిళ ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం పలువురిని కదిలించింది.
నర్సియమ్మ దాతృత్వం ఇదే తొలిసారి కాదు. గతంలో తనకు ఆశ్రయం కల్పించిన ధారాలమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళంగా అందించారు. స్థానిక శివాలయానికి రూ.50 వేలు సమర్పించారు. అంతేకాకుండా శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి బంగారు కళ్లు చేయించి కానుకగా ఇచ్చినట్లు తెలిపారు. చుట్టుపక్కల చిన్న దేవాలయాలకు సైతం రూ.10 వేలు, రూ.20 వేల చొప్పున విరాళాలు అందిస్తూ తన భక్తిని చాటుకున్నారు. జీవనం కోసం యాచిస్తున్నా.. తన సంపాదనలో కొంత భాగాన్ని దేవుడి సేవకు అంకితం చేస్తున్న నర్సియమ్మ గొప్ప మనసు నిజంగా ఆదర్శనీయం. సంపద కన్నా దాతృత్వమే గొప్పదని ఆమె తన చేతలతో చూపిస్తున్నారు.