భార్యని కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. ఎందుకంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో భార్యపై అనుమానం పెంచుకున్న సుఖ్‌బీర్ సింగ్ అనే వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్య సోనమ్‌ను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెను కుర్చీకి కట్టేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తన ఇద్దరు చిన్నారులను వెంట తీసుకుని నిందితుడు గ్రామం నుంచి పారిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కన్నౌజ్ జిల్లా చిబ్రమౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌పూర్ గ్రామానికి చెందిన సోనమ్ (30)కు, సుఖ్‌బీర్ సింగ్ అలియాస్ మోనుతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సుఖ్‌బీర్ హర్యానాలోని హిసార్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సుమారు 15 రోజుల క్రితమే అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో తన భార్యకు సంబంధం ఉందంటూ అనుమానం పెంచుకున్నాడు. ఫోన్‌లో ఆ యువకుడితో సోనమ్ మాట్లాడుతుండగా చూసినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మరింత తీవ్రంగా మారినట్లు సమాచారం.
ఈ క్రమంలో గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో సుఖ్‌బీర్ దారుణానికి పాల్పడ్డాడు. సోనమ్‌ను ఇంట్లోని ఓ కుర్చీకి తాళ్లతో కట్టేసి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. మంటలు ఇంట్లో వ్యాపించడంతో పాటు లోపలి నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు సుమారు గంటన్నర పాటు శ్రమించారు. అనంతరం పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా సోనమ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. మంటల తీవ్రతకు ఆమె మృతదేహం తీవ్రంగా కాలిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అవశేషాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన సుఖ్‌బీర్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తల్లి ప్రాణాలు కోల్పోగా, తండ్రి నిందితుడిగా పరారవడంతో ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఏంటన్నది స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.