వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వచ్చేసింది.. పేరు, జెండా, అజెండా అన్నీ రెడీ..!

Vijayasai Reddy

ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త అధ్యాయం ప్రారంభించారు. నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలో పరివర్తన రాజనీతి (PRP) పార్టీని ప్రకటించారు. రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యమని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలైంది. 11వ నెల.. 11వ తేదీ.. ఉదయం 11 గంటల 11 నిమిషాలు.. ఇలా ప్రత్యేకమైన 11-11-11 ముహూర్తాన్ని ఎంచుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా 'పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో కొత్త పార్టీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా ప్రకటించారు. కాషాయం, తెలుపు రంగులతో రూపొందించిన జెండా మధ్యలో ధర్మచక్రాన్ని ఏర్పాటు చేశారు. కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరో రాజకీయ వేదిక అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ శక్తులకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. అదే లక్ష్యంతో పార్టీని ప్రారంభించినట్లు వెల్లడించారు. కుటుంబ రాజకీయాలకు, కులమత ఆధారిత రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని, జెన్ జీ తరాన్ని నాయకులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలే తమ పార్టీ ఎజెండా అని పేర్కొంటూ కరువు, కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరానికి రెండు పంటలకు సరిపడా నీరు, ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పెరిగేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కొత్త పార్టీ ప్రకటనతోనే రాజకీయ వర్గాల్లో చేరికలపై చర్చ మొదలైంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నపరెడ్డి విజయభాస్కర్ కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అలాగే జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విశాఖపట్నానికి చెందిన పీతల మూర్తియాదవ్ పేరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులు, వివిధ పార్టీల్లో గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు కూడా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఈ చేరికలపై మరిన్ని అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు వైసీపీలో కీలక నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య సాగుతున్న రాజకీయ పోరులో పరివర్తన రాజనీతి పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. యువతను ఎంతమేర ఆకర్షిస్తుంది? ఇతర పార్టీల నుంచి ఎంతమంది నాయకులు చేరతారు? ప్రజల్లో ఎలాంటి ఆదరణ లభిస్తుంది? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పోటీకి తెరలేచింది.