AP Politics: 11-11-11.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ముహూర్తం ఫిక్స్.. జగన్‌కు కౌంటరేనా..?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో తన కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ పేరును ప్రకటించనున్నారు. అయితే ఈ ప్రకటనలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. నెల, తేదీ, గంటలు, నిమిషాల్లో 11 సంఖ్య వచ్చేలా ముహూర్తాన్ని నిర్ణయించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా తన కొత్త పార్టీ ఏర్పాటుపై వివరాలు వెల్లడించారు. అమ్మవారి దీవెనలతో, ప్రజల ఆకాంక్షలే అజెండాగా కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునేవారంతా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ పేరుతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
తన కొత్త పార్టీ లక్ష్యాల గురించి కూడా విజయసాయిరెడ్డి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో రెండు పార్టీలు, రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలకాలని, కుల, మత రాజకీయాలకు దూరంగా ఉండాలని తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరు, ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ఎజెండాలో ఉంటాయని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే, విజయసాయిరెడ్డి ఎంచుకున్న 11 నంబర్ ముహూర్తంపై మరో చర్చ కూడా నడుస్తోంది. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ ప్రకటనకు 11-11-11 సమయాన్ని ఎంచుకోవడంతో కొందరు రాజకీయ వ్యాఖ్యాతలు, నెటిజన్లు ఈ రెండు అంశాలను పోలుస్తున్నారు. ఇది వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యంగ్యమా..? లేక యాదృచ్ఛికంగా కుదిరిన ముహూర్తమా? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. అయితే ఈ నంబర్‌ను జగన్‌పై వ్యంగ్యంగా ఎంచుకున్నారనే విషయానికి విజయసాయిరెడ్డి నుంచి స్పష్టమైన ధ్రువీకరణ లేదు.