చిన్న బోరుబావి కోసం ఇంతటి దారుణమా..? 17 నెలల పసికందును నేలకేసి కొట్టిన కిరాతకుడు..!
వికారాబాద్ జిల్లా పరిగి మండలం సాలిపాలబాట తాండాలో బోరుబావి పైప్‌లైన్ విషయంలో దాయాదుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి 17 నెలల పసికందును నేలపైకి విసిరేయడంతో చిన్నారికి తలకు తీవ్ర గాయమైంది.
ఆస్తి తగాదాలు, భూ వివాదాలు మనుషుల్లోని విచక్షణను ఎలా చంపేస్తున్నాయో చెప్పడానికి వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అద్దం పడుతోంది. ఒక చిన్న బోరుబావి విషయంలో మొదలైన గొడవ చివరకు 17 నెలల పసికందుపై దాడికి దారితీసింది. చేతిలో ఉన్నది చిన్నారి అన్న కనీస కనికరం కూడా లేకుండా ఓ వ్యక్తి ఆ పసికందును నేలకేసి విసిరేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పరిగి మండలం సాలిపాలబాట తాండాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది.
స్థానికుల వివరాల ప్రకారం.. తాండాకు చెందిన చందర్, రవి కుటుంబాలు దాయాదులు. వీరి మధ్య కొంతకాలంగా వ్యవసాయ బోరుబావి విషయంలో వివాదం కొనసాగుతోంది. బోరుబావి తమదంటే తమదంటూ ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చందర్ వినియోగిస్తున్న బోరుబావికి సంబంధించిన నీటి పైప్‌లైన్‌ను రవి కుటుంబ సభ్యులు కత్తిరించడంతో వివాదం మరోసారి రాజుకుంది. ఈ విషయం తెలుసుకున్న చందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన కుమార్తె సుచిత్రతో కలిసి రవి కుటుంబ సభ్యులను నిలదీసేందుకు వెళ్లాడు. పైప్‌లైన్ ఎందుకు కత్తిరించారంటూ ప్రశ్నించడంతో పాటు, ఆధారంగా ఉండేందుకు సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు.
అయితే చందర్ ప్రశ్నించడం, వీడియో తీయడం రవి కుమారుడు తులసీరామ్‌కు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో మాటామాటా పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. ఆవేశానికి లోనైన తులసీరామ్ చందర్ ఇంట్లోకి వెళ్లి అతడితో పాటు సుచిత్రపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సుచిత్ర చేతిలో ఉన్న 17 నెలల పసికందును కూడా వదల్లేదు. చిన్నారిని ఆమె నుంచి లాక్కుని నేలపైకి విసిరేశాడు. ఈ దాడిలో పసికందు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. గొడవలో చందర్, సుచిత్ర కూడా గాయాలపాలయ్యారు. ఒక బోరుబావి పైప్‌లైన్ విషయంలో మొదలైన వివాదం చివరకు పసికందు ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తీసుకురావడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
గాయపడిన వారిని స్థానికులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారితో పాటు చందర్, సుచిత్ర చికిత్స పొందుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ కత్తిరించిన ఘటనపై తాను ముందుగానే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చందర్ చెబుతున్నాడు. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ దాడి జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కుటుంబంపై దాడి చేసి, పసికందును సైతం గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. చిన్నపాటి నీటి వివాదం ఇంతటి అమానుష ఘటనకు దారితీయడం సాలిపాలబాట తాండాలో చర్చనీయాంశంగా మారింది.