విశాఖలో కొత్తగా 30 ఈవీ మెట్రో బస్సులు ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం!
విశాఖపట్నంలో పర్యావరణహిత ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా 30 ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను ప్రారంభించింది. గాజువాక ఆర్టీసీ డిపోలో ప్రారంభమైన ఈ బస్సుల్లో మహిళలు 'స్త్రీ శక్తి' పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ బస్సుల ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు నగర ప్రజలకు, పర్యాటకులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయి.
విశాఖపట్నం నగర ప్రజలకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నగరంలో కొత్తగా 30 ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో భాగంగా ఈ బస్సులను గాజువాక ఆర్టీసీ డిపోలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలిసి బస్సులకు జెండా ఊపారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖలో పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' పథకం ద్వారా మహిళలు ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. దీంతో నగరంలో రోజూ ప్రయాణించే మహిళలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగనుంది.
మరోవైపు ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వల్ల వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని వివరించారు. నగరంలో ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే ఈ కొత్త సర్వీసుల లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఆధునిక ఫీచర్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
ఈ కొత్త బస్సుల రాకతో విశాఖ నగర ప్రజలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత ఆధునికంగా మారడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడనుంది. అయితే ఈ బస్సులు ఏయే మార్గాల్లో నడుస్తాయనే పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.