Voter List: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? టెన్షన్ వద్దు.. ఈసీ మరో ఛాన్స్ ఇచ్చింది..!
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన అర్హులైన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. SIR ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేకపోయిన వారు మళ్లీ ఫారాలు అందజేయవచ్చు. బీఎల్ఓల ద్వారా ఇంటింటికీ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించారు.
ఓటరు జాబితాలో మీ పేరు కనిపించడం లేదా? ఓటు హక్కు కోల్పోయినట్లేనని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారు మరోసారి ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో తమ పేరు ఓటరు జాబితాలో లేక ఇబ్బంది పడుతున్న వారికి ఊరట లభించనుంది.
గతంలో గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్ ఓటర్లు వంటి కేటగిరీల్లో గుర్తించిన కారణాలతో కొందరి పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించలేదు. అయితే ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం, వివిధ కారణాలతో వాటిని సమర్పించలేకపోవడం వల్ల పేరు నమోదు కాని అర్హులైన ఓటర్లు ఇప్పుడు మరోసారి అవకాశం వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత వివరాలను మరోసారి పరిశీలించనున్నారు.
ఈ నిర్ణయం ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలకు వర్తించనుంది. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో సంబంధిత ఓటర్ల జాబితాలను మరోసారి ప్రదర్శించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాదు.. ఓటర్ల పేర్లు ఏ కారణంతో జాబితా నుంచి తొలగించారో కూడా వెల్లడించనున్నారు. దీంతో తమ పేరు ఎందుకు కనిపించడం లేదో ఓటర్లు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించనున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా ఫారాలు పొందే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా పాత EPIC నంబర్ ఉపయోగించి ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ లేదా ECINET యాప్ ద్వారా కూడా ఫారాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక ఒక ప్రాంతం నుంచి అదే రాష్ట్రంలోని మరో ప్రాంతానికి ఇల్లు మార్చుకున్నవారు తమ కొత్త చిరునామా వివరాలతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇల్లు లేని వారికి చిరునామా ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా.. బీఎల్ఓ క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా వారి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించారు.
అయితే ఇప్పటికే ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఓటరు జాబితాలో పేరు లేదని ఆందోళన చెందుతున్న అర్హులైన వారు నిరాశ చెందాల్సిన పనిలేదు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటు ఓటు హక్కును పొందేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.