వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Pallavi |

వెబ్ వాట్సాప్ వాడుతున్నారా.. కేంద్రం కీలక హెచ్చరిక..

వాట్సప్ వెబ్ వినియోగదారులకు కేంద్రం కీలక హెచ్చరిక..

పబ్లిక్ లేదా ఆఫీసు కంప్యూటర్లలో వాట్సప్ వెబ్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్ నేరాల నిరోధక విభాగం (I4C) హెచ్చరించింది. కేవలం బ్రౌజర్ ట్యాబ్ క్లోజ్ చేయకుండా ప్రతి సెషన్ తర్వాత కచ్చితంగా మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయాలని, లేకపోతే సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్ ట్యాబ్‌లు వినియోగించాలని, అనుమానిత లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించింది.

నేటి డిజిటల్ యుగంలో చాలామంది తమ పనులను సులభంగా పూర్తి చేసుకునేందుకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సప్ వెబ్ (WhatsApp Web) వినియోగిస్తున్నారు. అయితే, ఆఫీసు లేదా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సప్ వెబ్ వాడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ నేరాల నిరోధక విభాగం 'ఐ4సీ' (I4C) తాజాగా ఒక ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. పబ్లిక్ సిస్టమ్స్‌లో వాట్సప్ వెబ్ లాగిన్ చేసి వదిలేస్తే, ఆ ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పబ్లిక్ కంప్యూటర్లలో ఉపయోగించే వాట్సప్ ఖాతాలను ఇతరులు యాక్సెస్ చేసే ముప్పు ఎక్కువగా ఉంటుందని I4C తన అడ్వైజరీలో పేర్కొంది. దీనిని సైబర్ కేటుగాళ్లు అవకాశంగా మలుచుకుని అనధికారికంగా ఖాతాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, వారి కాంటాక్ట్ లిస్ట్, పర్సనల్ మెసేజ్‌లు వంటి కీలక వివరాలను తస్కరించే ఆస్కారం ఉందని వివరించింది. అంతేకాకుండా, ఖాతాదారుల ఐడెంటిటీని ఉపయోగించి వారి పరిచయస్తులను నమ్మిస్తూ భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సప్ వెబ్ ఉపయోగించే వారు సాధారణంగా పని పూర్తయిన తర్వాత బ్రౌజర్ విండో లేదా ట్యాబ్‌ను క్లోజ్ చేసి వెళ్లిపోతుంటారు. కానీ, కేవలం బ్రౌజర్ విండో లేదా ట్యాబ్ క్లోజ్ చేస్తే సరిపోదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి సెషన్ తర్వాత కచ్చితంగా మాన్యువల్‌గా వాట్సప్ నుంచి 'లాగ్ అవుట్' (Log Out) చేయాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు వంటి పబ్లిక్ డివైజ్‌లలో, అనధికారిక సిస్టమ్స్, ఇతరుల కంప్యూటర్లలో వాట్సప్ వెబ్ లాగిన్ అవ్వొద్దని అడ్వైజరీలో ప్రత్యేకంగా పేర్కొంది. ఒకవేళ అత్యవసరమై పబ్లిక్ కంప్యూటర్లలో తప్పనిసరిగా వాట్సప్ వెబ్ వాడాల్సి వస్తే, బ్రౌజర్‌లో 'ఇన్‌కాగ్నిటో' (Incognito) లేదా 'ప్రైవేట్ ట్యాబ్‌'లను (Private Tabs) వినియోగించడం మంచిదని సూచించింది. అదేవిధంగా, పబ్లిక్ వాట్సప్ వెబ్ ఖాతాల్లో వచ్చే అనుమానిత లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని కోరింది. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు డివైజ్‌లలోని భద్రతాపరమైన సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.