Winter: చలికాలంలో చెవి నొప్పితో బాధపడుతున్నారా.. రాత్రిళ్లు మరీ ఎక్కువైతే ఈ విషయం తెలుసుకోండి..!
చలికాలంలో జలుబు, ముక్కు మూసుకుపోవడంతో పాటు చెవి నొప్పి కూడా వేధిస్తుంటుంది. ముఖ్యంగా రాత్రివేళ నొప్పి తీవ్రం కావడం, చెవి మూసుకుపోయినట్లు అనిపించడం, వినికిడి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అసలు చెవి నొప్పికి కారణాలేంటి? ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెవిలో నూనెలు, ఇతర పదార్థాలు వేయడం ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోండి.
చలికాలం మొదలైందంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. వీటితో పాటు చెవిలో మొదలయ్యే నొప్పి కూడా నిద్రలేకుండా చేస్తుంది. చెవిలో ఏదో గుచ్చినట్లు నొప్పి రావడం, చెవి మూసుకుపోయినట్లు అనిపించడం, రాత్రి వేళ నొప్పి ఎక్కువై అసౌకర్యానికి గురిచేయడం వంటివి చాలామందికి ఎదురవుతాయి. ముఖ్యంగా పిల్లలు చెవి నొప్పితో ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అయితే చలికాలంలో చెవి నొప్పి రావడానికి కేవలం చల్లని గాలి మాత్రమే కారణం కాదు. జలుబు, చెవిలో ఒత్తిడి పెరగడం, ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాలు ఉండవచ్చు.
చలికాలంలో చాలామందికి జలుబు చేసినప్పుడు ముక్కు బాగా మూసుకుపోతుంది. ముక్కు, మధ్య చెవిని కలిపే యూస్టాచియన్ ట్యూబ్‌లో వాపు లేదా అడ్డంకి ఏర్పడితే చెవిలో ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది. చెవి నిండుగా ఉన్నట్లు, ఏదో అడ్డుపడినట్లు అనిపించవచ్చు. కొందరిలో వినికిడి కూడా తాత్కాలికంగా తగ్గినట్లు ఉంటుంది. ఇలాంటి సమస్యలు జలుబు తగ్గిన తర్వాత క్రమంగా మెరుగవుతుంటాయి. అయితే చెవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నొప్పి మరింత ఎక్కువగా ఉండవచ్చు.
చెవిలో గులిమి పేరుకుపోవడం, చెవిలోకి నీరు చేరడం, గొంతు లేదా దంత సమస్యలు కూడా చెవి నొప్పికి కారణం కావచ్చు. అందుకే నొప్పి వచ్చిన ప్రతిసారీ చలి వల్లే అనుకోవడం సరికాదు. చెవిలో సూది గుచ్చినట్లు నొప్పి, బరువుగా అనిపించడం, వినికిడి తగ్గడం, ఈల వేసినట్లు శబ్దాలు వినిపించడం, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు పదేపదే చెవిని పట్టుకోవడం, గోక్కోవడం, చిరాకు పడటం, సరిగా నిద్రపోకపోవడం వంటివి కూడా చెవి సమస్యలకు సంకేతాలు కావచ్చు.
చెవి నొప్పి వచ్చినప్పుడు ఉపశమనం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. శుభ్రమైన గుడ్డను గోరువెచ్చగా చేసి చెవి బయట భాగంపై కాసేపు ఉంచితే నొప్పి తగ్గేందుకు సహాయపడుతుంది. అయితే మరీ వేడిగా ఉండే కాపడం పెట్టకూడదు. చలిలో బయటకు వెళ్లేటప్పుడు చెవులు కప్పుకునే టోపీ లేదా మఫ్లర్ ధరించడం మంచిది. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వయస్సు, ఆరోగ్య పరిస్థితికి తగిన నొప్పి నివారణ మందుల గురించి వైద్యుడు లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవడం కూడా ముఖ్యం.
అయితే చెవి నొప్పి తగ్గించుకోవడానికి వెల్లుల్లి నూనె, ఆవ నూనె, తులసి రసం వంటి వాటిని చెవిలో వేసుకోవడం మాత్రం మంచిది కాదు. చెవిలో ఇన్ఫెక్షన్ ఉందా, కర్ణభేరి దెబ్బతిన్నదా అనేది తెలియకుండా ఇలాంటి పదార్థాలు వేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాటన్ బడ్స్, పిన్నులు లేదా ఇతర వస్తువులతో చెవిని శుభ్రం చేయడానికి ప్రయత్నించకూడదు. చెవి గులిమిని మనమే తొలగించుకోవడం కూడా ప్రమాదకరం కావచ్చు.
చెవి నుంచి చీము లేదా ద్రవం రావడం, జ్వరం, చెవి చుట్టూ వాపు, వినికిడి తగ్గడం, తల తిరగడం లేదా తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నొప్పి రెండు మూడు రోజులైనా తగ్గకపోయినా ఈఎన్టీ నిపుణుడిని కలవడం మంచిది. చలికాలంలో చెవి నొప్పి సాధారణ సమస్యే అయినప్పటికీ, దాని వెనుక కారణాన్ని గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు పెరగకుండా నివారించవచ్చు.