వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వినోదం | రచన: Pallavi |

ఒకే సినిమాలో 16 పాత్రల్లో యోగిబాబు.. లేడీ గెటప్‌లోనూ కనిపించనున్న స్టార్ కమెడియన్!

ఒకే సినిమాలో 16 పాత్రల్లో యోగిబాబు..

ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ‘మునిసామి’ సినిమాలో యోగిబాబు ఏకంగా 16 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. మహిళ గెటప్‌తో పాటు ఆమె భర్త పాత్రలోనూ ఆయనే నటిస్తున్నట్లు విడుదలైన పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.

తమిళ సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు యోగిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన హావభావాలు, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన ఆయన.. ఇప్పుడు ఒకే సినిమాలో ఏకంగా 16 పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘జైలర్’, ‘జైలర్ 2’ వంటి సినిమాల్లో తన కామెడీతో అలరించిన యోగిబాబు.. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడు ప్రభుదేవా కథానాయకుడిగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘మునిసామి’లో ఆయన 16 విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉందని తెలుస్తోంది. యోగిబాబు మహిళ గెటప్‌లోనూ కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో యోగిబాబు మహిళ పాత్రలో కనిపించడమే కాకుండా, ఆ పాత్రకు భర్తగా ఉండే వ్యక్తి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఓ పోస్టర్ ఈ ఆసక్తికి కారణమైంది. కుటుంబ ఫొటోను తలపిస్తున్న ఈ పోస్టర్‌లో మహిళ వేషధారణలో ఉన్న యోగిబాబు సోఫాపై కూర్చొని కనిపిస్తున్నారు. ఆమె పక్కనే కూర్చుని భుజంపై చేయి వేసిన వ్యక్తి కూడా యోగిబాబే కావడం విశేషం. దీంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి వినోదాన్ని పంచబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఒకే నటుడు 16 విభిన్న పాత్రల్లో కనిపించడం, అందులోనూ మహిళ పాత్రతో పాటు ఆమె భర్త పాత్రను కూడా పోషించబోతున్నారనే ప్రచారం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యోగిబాబు మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ‘మునిసామి’ సినిమాలో ఆయన పోషించిన 16 పాత్రలు వెండితెరపై ఎలాంటి సందడి చేస్తాయో చూడాలి.