YS Jagan: షర్మిల కూతురు పెళ్లిపై జగన్ లేఖ.. బెంగళూరులోని నా ఇంట్లో వద్దు.. మరో చోట చేసుకోండి!
వైఎస్ షర్మిల కూతురు అంజలి వివాహం నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. బెంగళూరులోని తన నివాసంలో పెళ్లి నిర్వహించడంపై భద్రత, వ్యక్తిగత గోప్యత కారణాలతో అభ్యంతరం తెలిపారు.
వైఎస్ షర్మిల కూతురు అంజలి వివాహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ పెళ్లి నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంజలి వివాహం గురించి తెలిసి సంతోషం వ్యక్తం చేసిన జగన్.. పెళ్లిని బెంగళూరులోని తన నివాసంలో నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు. తన ఇంట్లో కాకుండా మరో వేదికను ఎంచుకోవాలని షర్మిలను కోరారు. ఈ మేరకు లేఖలో తన అభిప్రాయాలను, భద్రతాపరమైన ఆందోళనలను వివరించారు.
గత ఏడేళ్లుగా తమ మధ్య ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అంజలి జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఆమె పెళ్లి జీవితంలో ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. అయితే, తన అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని తన నివాసంలోనే వివాహం నిర్వహించాలని షర్మిల భావిస్తున్నట్లు తనకు తెలిసిందని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం తాను నివసిస్తున్న ఇంట్లో పెద్దఎత్తున వివాహ వేడుక నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వివరించారు.
వివాహ వేడుకకు అతిథులతో పాటు క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఇలా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని జగన్ పేర్కొన్నారు. వారిలో చాలామంది తమకు పరిచయం లేని వ్యక్తులే ఉంటారని, ఇంతమంది నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇంటికి, పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందిగా మారవచ్చని తెలిపారు. అంజలిపై తనకు ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ, తన కుటుంబ భద్రతకు సంబంధించిన అంశాలను విస్మరించలేనని స్పష్టం చేశారు.
అయితే, పెళ్లి నిర్వహణకు తాను ప్రత్యామ్నాయాలను కూడా సూచించినట్లు జగన్ లేఖలో పేర్కొన్నారు. గతంలో రాజా వివాహం నిర్వహించినట్లుగా కన్వెన్షన్ సెంటర్లో లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో పెళ్లి చేసుకోవచ్చని తెలిపారు. అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్లోని తన లోటస్ పాండ్ ఆస్తిని వివాహ వేడుక కోసం ఉపయోగించుకోవచ్చని ప్రతిపాదించారు. ఈ అవకాశం ఇప్పటికీ అందుబాటులోనే ఉందని పేర్కొన్నారు. అంజలి పెళ్లి విషయంలో తాను చేయగలిగిన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన అభిప్రాయాన్ని కూడా షర్మిల అర్థం చేసుకోవాలని కోరారు.
తన అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం బాధ కలిగించిందని జగన్ లేఖలో పేర్కొన్నారు. తన నివాసంలో తాను, తన కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవడం తన బాధ్యత అని వివరించారు. ఈ నిర్ణయం తీసుకోవడం సులభం కాకపోయినా, భద్రత, వ్యక్తిగత గోప్యత అంశాలను దృష్టిలో పెట్టుకుని మరో వేదికను ఎంచుకోవాలని కోరారు. అంజలి వివాహం సంతోషకరమైన జ్ఞాపకంగా మిగలాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ లేఖతో అంజలి వివాహ వేదికపై జగన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లయింది.